top of page

నేటి రామకృష్ణుల కథ

ఇది ప్రతీ విద్యార్థి కథ, ఇది నేటి భారత యువత కథ!


అప్పటి మన తెనాలి రామకృష్ణుడు కాళికా మాతను జ్ఞానాన్ని ప్రసాదించమని కోరాడు. తద్వారా ఆయనకు జ్ఞానంతో పాటు పేరు-ప్రతిష్టలు, సిరి-సంపదలు కూడా అనుసంధానంగా వచ్చాయి. అది ఆనాటి పరిస్థితి.


కానీ, ఇప్పటి చాలా మంది జ్ఞానవంతులైన రామకృష్ణులు అవకాశాలు దొరక్క రోడ్ల మీద తిరుగుతున్నారు, ఇది ఈనాటి దుస్థితి. దీనికి కారణం అప్పట్లో లాగా ఇప్పుడు జ్ఞానవంతులని ఎవరూ సరిగ్గా గుర్తించలేకపోవటం, గుర్తింపు ఇవ్వలేకపోవటమే. ఈ రోజుల్లో జ్ఞానం ఉంటే, మిగతావన్నీ వస్తాయి అంటే పొరపాటే.


ఆనాడు ఎవరైనా పాటలు వినసొంపుగా పాడినా, నాట్యం కనులవిందుగా చేసినా శభాష్ అనే వారు, కళల్ని ప్రోత్సహించి పోషించే వారు, అభిమానించి ఆదరించే వారు, ఆరాధించే వారు. కానీ ఇప్పుడు కళ అంటే ఏదో నిద్దట్లో వచ్చే కల అనుకుంటున్నారు గాని, నృత్యం, సంగీతం, కవిత్వం, కావ్యం, చిత్రలేఖనం ఇలా చతుష్షష్టి కళలు ఉన్నాయని ఎవరికి గుర్తుంది, ఎవరికి పట్టింది.


ఆదరణ లేని ఈ లోకంలో ఉంటూ కూడా, ఏదో సాధిద్దామని ధైర్యంగా మొదలుపెడితే, అయిన వారి నుండి ఆంక్షలు, అవకాశాలు ఇచ్చే వాళ్ళు చూపించే వివక్షలతో, సహనాన్ని పరీక్షిస్తున్నారు, ధైర్యాన్ని చంపేస్తున్నారు. ఇవ్వన్నీ దాటుకుని అడుగు ముందుకు పడినా, ఆ అడుగు తడబడకుండా నిలవాలంటే, ఎందరో కాళ్ళు పట్టాలి, వాళ్ళ అడుగులకు మడుగులొత్తాలి. దేనికిది? తల్లిదండ్రులవో, గురువులవో, దేవుడివో, లేదా ఓ సైనికుడి పాదాలు మొక్కితే అర్థముంది గాని, వీళ్ళ పాదాలు ఎందుకు మొక్కాలి? మొక్కకపోతే తొక్కేస్తారా? కళల్ని నమ్ముకున్నోడు ఎప్పటికీ కలల్లో బ్రతకాల్సిందేనా?


సరే కళలు పక్కన పెడదాం...పోనీ చదువైనా సరిగ్గా ఉందా అంటే, అది కూడా "సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పశ్చిమాన అస్తమిస్తాడు" అనే అబద్దంతో మొదలవుతుంది. అంతే గానీ, "సూర్యుడు అసలు కదలడు, భూమి తను చుట్టూ తాను తిరగటం వల్లే ఈ పగలు, రాత్రులు ఏర్పడుతున్నాయి" అనే వాస్తవం ఈ రోజుల్లో ఎంతమంది విద్యార్థులు గ్రహిస్తున్నారు, గుర్తుపెట్టుకుంటున్నారు, ఎంతమంది ఉపాధ్యాయులు అంత కచ్చితంగా బోధిస్తున్నారు? విద్యార్ధి యొక్క జ్ఞానం పర్సెంటేజీలలో కాదు, ఒక విషయాన్నీ ఎంత క్షుణ్ణంగా అర్ధం చేసుకుంటున్నాడో అన్న దాని బట్టి అంచనా వేయాలి. చెప్పేవాడే సరిగ్గా లేనప్పుడు, వినే వాడు విన్నదే నిజమనుకుంటున్నాడు. అలా ఏదో చదివిస్తున్నారు, వీళ్ళు చదివేస్తున్నారు. చివరికి ఎంత చదివినా, ఏం చదివినా, హైదరాబాద్ లోనో, బెంగుళూరు లోనో ఏదోక సాఫ్ట్వేర్ కోర్సులు చేసేసి, ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఇంత మాత్రానికి ఇంతంత చదువులు, అంతంత ఫీజులు. నెలాఖరుకి వచ్చే జీతం చూసి మురిసిపోతూ జీవితం యొక్క అసలర్థం మర్చిపోతున్నారు.


టెక్నాలజీ అభివృద్ధి చెందటం మంచిదే. కానీ, ప్రతీ ఒక్కరూ కార్పొరేట్ మాయలో పడిపోయి, వాళ్ళిచ్చేదే జీతం, అదే జీవితం అనే మూసలో, అదే ధోరణిలో ఉండటం, ఉండిపోవటం ఎంతవరకూ సరైనది? అందరూ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, మీలో ఎంతమంది ఇష్టంగా సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకున్నారు? ఎంతమంది వాళ్ళు చూపించే ఆకర్షణీయమైన జీతం చూసో, లేదా ఎవరో చెప్పారనో, ఇంట్లో పోరు భరించలేకో, అటువైపు పరుగులు పెట్టారు? ఇష్టంతో వెళ్లిన వాళ్ళు సరే, కానీ, ఈ విధంగా వెళ్లిన వాళ్ళు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారని మీకెప్పుడూ అనిపించలేదా? అనిపించినా, ఆ మాట మీ మనసు దాకా వినిపించలేదా? చదువుకున్నది ఏంటి, చేస్తుంది ఏంటి? అనుకున్నది ఏంటి, అనుభవిస్తుంది ఏంటి? వాడెవడో చెప్పాడని నువ్వూ అటువైపే ఎందుకు? నీకంటూ నువ్వెంచుకున్న దారి లేదా?


నేను ఏ రంగానికి విరుద్దం కాదు.. ఉదాహరణకు చెబుతున్నాను అంతే!

ఇటు పెద్దల ధోరణి కూడా అలాగే ఉంది, నెలకు ఓ నలభై యాభై వేలు సంపాదించే వాడికే విలువిస్తున్నారు, లేదా అలుసుగా చూస్తున్నారు, అది కన్న బిడ్డలైన, ఇతరలైనా. ఏమైనా ఆంటే రూపాయికి విలువ లేదు, అంత కూడా సంపాదించకపోతే ఎలా అంటారు. పడిపోయింది రూపాయి విలువ కాదు, మనిషి విలువ, కష్టం విలువ, ఆలోచన విలువ. అందుకే ఎంతోమంది తెలివితేటలు ఉండి కూడా గొర్రెల్లా బ్రతకాల్సి వస్తుంది.


మరి ఇది నేటి తరం చేసుకున్న దురదృష్టమో, లేదా ఈ యుగం కార్పొరేట్ వ్యవస్థల పరమో ఏమో, దీన్ని ఆపుట ఎవరి తరమో?
మరి ఈనాటి రామకృష్ణులు ఆ కాళికా మాత ఎదురైతే ఏమని కోరుకోవాలో? గుర్తింపు లేని జ్ఞానాన్నా, గుర్తింపు కోల్పోయిన కళలనా, చేజారిపోతున్న విలువలనా, ఆ విలువలని కాపాడుకోవాలనే ఆలోచననా, ఎలాగోలా బ్రతకాలనే మనసునా, ఎలాగైనా బ్రతకాలనే ఆశనా, ఆ ఆశను నిలబెట్టే ధైర్యాన్నా?
28 views1 comment

1 Comment


Radha Manikala
Radha Manikala
Apr 08, 2021

నిజం చెప్పారు.. ప్రస్తుత రోజుల్లో ఇదే జరుగుతుంది.. కార్పొరేట్ మాయలో తను పడిందే కాక.. పక్క వాళ్ళని కూడా ప్రత్యక్షం గా.. పరోక్షం గా అందులో కి లాగుతున్నారు...

Like
bottom of page