ప్రియమైన అందరికీ,
మన చుట్టూ జరుగుతుంది మనమంతా కళ్లారా వీక్షిస్తున్నాం.. ఇప్పుడు నేను మాట్లాడేది చూసే వారికన్నా, అలాంటి ఓ పరిస్థితిలో తమ సొంత వాళ్ళు ఉన్నవాళ్లో, లేదా దాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వారికీ బాగా అర్ధం అవుతుంది. మిగతా వాళ్ళు కూడా వాళ్ళని చూసి అర్ధం చేసుకోవడం ఎంతో ఉత్తమం.
1st వేవ్ చూసి మనం గాని, మన నాయకులు గాని ఏం నేర్చుకున్నాం? నన్ను కూడా కలుపుకునే మాట్లాడుతున్నాను! దేశం మీద బాధ్యత వరకూ వద్దు.. కనీసం మన కుటుంబం గురించి ఆలోచించి ఎంతమంది జాగ్రత్తగా ఉంటున్నాం? మనమంటే మనకి నిర్లక్ష్యం సరే.. ఉత్తప్పుడు మహా అయితే జ్వరం వస్తుంది, మహా అయితే ఓ వారం మన శరీరం బాధపడుతుంది. దాని వల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళు అంతగా ప్రభావితం కారు.
కానీ ఇది అలా కాదు కదా... వాళ్ళకి అంటుకుంటుందా, అంటుకోదా అనే విషయం పక్కన పెడితే.. మన కోసం నిత్యం తపించే, ప్రేమించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచం మొత్తం మీద మన కుటుంబ సభ్యులు మాత్రమే! ఈ మాట ఒప్పుకున్నవాళ్ళే మిగతాది చదవండి. మరి అలాంటప్పుడు, మనకేదైనా అయితే వాళ్ళు ఎంత మానసిక క్షోభకు గురవుతారు? ఆ బాధ వర్ణనాతీతం! అలాంటి ఓ నిస్సహాయ స్థితిలోకి, దారుణమైన స్థితిలోకి, శోకసంద్రంలోకి మన వాళ్ళు, మనపై పంచప్రాణాలు పెట్టుకున్న మన మనుషులు వెళ్ళకూడదు అంటే... మనం జాగ్రత్తగా ఉండాలి!
మనం ఆరోగ్యంగా ఉంటే, వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు! ప్రతీ సారీ నిర్లక్ష్యం పనికిరాదు! దయచేసి జాగ్రత్తగా ఉంటూ, మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, మీ వాళ్ళని మీరు కాపాడుకోండి!
--- జై హింద్! --- మీ హేమంత్
Comentários