top of page

'మన ప్రేమ అమరం!' - కవితా సంకలనం 1

నేను రాసిన 'మన ప్రేమ అమరం!' అను ప్రేమకథ లోని

కొన్ని కవితలను ఇక్కడ సంకలనం చేశాను.


"మందార పువ్వు సింధూరం ధరించినట్టు…
అందలం నుండి దిగి వచ్చిన ఆ దేవత అందుకునేంత దగ్గరగానే ఉన్నా...
అందుకోలేని ఈ దూరం తరిగి తనకి చేరువయ్యే అదృష్టం నాకు ఉందో లేదో?
ఉంటే ఆ క్షణం ఇంకెంత దూరంలో ఉందో?
ఆ క్షణం కోసం నిరీక్షిస్తూ ఉండాలా? లేదా జరిగే మాయను వీక్షిస్తూ ఉండాలా?
ఏంటో చెదిరిన సంద్రంలోని అలల్లా ఎగసిపడే ఈ ఆలోచనలకు ఆనకట్ట వేయటం చాలా కష్టంగా ఉంది!"

(కథానాయకుడు 'తేజ' తను ఇష్టపడుతున్న ఆ అమ్మాయి 'గీతిక' గురించి తన డైరీలో రాసుకునే మాటలివి!)


***

“భావం ఉంది కానీ, చెప్పడానికి భాష సరిపోవటం లేదు…
ప్రేమ ఉంది కానీ, ప్రేమించబడే అదృష్టం లేదు…
అలాగే, బాధ కూడా ఉంది కానీ, పైకి తెలియటం లేదు!
ఏదో అందరి ముందు నవ్వుతున్నాను కానీ, ఆ నవ్వులో నిజం లేదు!
ఇంతిలా భయపడేవాడికి ప్రేమించే హక్కు లేదు!
అలల్ని, కాలాన్నే కాదు, కన్నీళ్ళని కూడా ఆపలేము!"

(గీతిక వేరొకరితో సన్నిహితంగా ఉండటం చూసి తేజ బాధతో రాసుకునే మాటలివి!)


***


"నక్షత్రాల్లాంటి నీ కన్నుల్లో... ప్రపంచాన్నే నిక్షిప్తం చేసావు!
నన్ను కూడా దాచుకోవచ్చు కదా కొంచెం... కడ దాకా కాచుకుంటాను!
నిను తలచినా, నిను చూసినా... నను నేను మరచిపోతున్నా!
ఈ తనువు నాదైనా... నా మనసు నీదని తెలుసునా!
నా తపన చూసైనా, ఆ అడ్డుతెరను దించి, నీ చెలిమి పంచవా ఇకనైనా!"

(ఇరువురి మధ్య స్నేహం బలపడిన తరువాత ఓ రోజు తేజ గీతిక ను చూస్తూ ఈ కవిత చెబుతూ తనకే తెలియకుండా పరోక్షంగా తన ప్రేమను వ్యక్తపరుస్తాడు!)


***


18 views0 comments
bottom of page