top of page

ఆపరేషన్ Vi

ఎపిసోడ్ - 1ఒకానొక సిటీలోని ఒక బస్టాండ్; సమయం రాత్రి 8:40 కావోస్తుంటుంది...

ఒకతను ఎవరి గురించో ఎదురుచూస్తున్నాడు. కాసేపటికి ఓ బస్సు ఆగింది. అందులో నుంచి ఒకతను చిన్న లగేజ్ బ్యాగ్ తో దిగి ఇతన్ని చూసి నవ్వుతూ దగ్గరకు వచ్చాడు.

అప్పుడు ఇతను "ఏరా విజయ్ ఎలా ఉన్నావ్" అంటూ వచ్చినతన్ని ఆలింగనం చేసుకున్నాడు ఆనందంగా.

అందుకు అతను "నేను బానే ఉన్నారా ప్రకాశ్. నువ్వు ఎలా ఉన్నావ్?" అని అడిగాడు.


"నేను బానే ఉన్నాను, ఏది ఇలా ఇవ్వు" అంటూ బ్యాగ్ తీసుకోబోతాడు ప్రకాశ్.


"పర్లేదు పెద్దగా బరువు లేదు" అని అన్నడు విజయ్. అలా వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తుంటారు.

***

ఒక టిఫిన్ సెంటర్; సమయం రాత్రి 9:20

ఇద్దరూ కలిసి రూమ్ కి వెళ్లే ముందు ఏదైనా తిందామని ఓ టిఫిన్ సెంటర్ ముందు ఆగారు. అప్పటికే అక్కడ దుకాణం సర్దేస్తున్నారు.

"అన్న వేడిగా ఏమున్నాయ్?" అక్కడి సర్వర్ ని అడిగాడు ప్రకాశ్


"అన్ని అయిపోయాయి అన్న.. టీ తప్ప ఏమీ లేవు" అన్నాడు సర్వర్


"సరే! అదే పట్టారా" అన్నాడు విజయ్


సర్వర్ టీ తెచ్చాక విజయ్ బ్యాగ్ లో ఉన్న బిస్కట్లు తింటూ టీ తాగుతుంటారు ఇద్దరూ.


"ఏ పని మీద వచ్చావ్ రా? ఫోన్ లో అడిగితే ఏం చెప్పలేదు!" అడిగాడు ప్రకాశ్ టీ సిప్ చేస్తూ.


"ఎస్.ఐ సెలెక్షన్స్ కోసమని వచ్చారా. మా అమ్మేమో పోలీస్ ఉద్యోగం తప్ప ఏదైనా చేయి అంటది. నీతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉంది, అందుకే చెప్పలేదు!" అన్నాడు విజయ్.


"నిజామా...అవ్వరా...నీ పొగరుకి, నీ కటౌట్ కి, నీ తెగువకి సరైన జాబ్ అది!" అన్నాడు ప్రకాశ్ విజయ్ బుజం తడుతూ.


ప్రకాశ్ అన్నట్టుగానే విజయ్ చూడటానికి ఉక్కుమనిషిలా ఉంటాడు. పల్లెటూరులో ఓ పక్క మూటలు మోస్తూ, మరోపక్క పొలం పనులు చేస్తూ, వ్యాయామశాలలో వర్కౌట్ లు చేసి రాటు తేలిన శరీరం తనది. పేరుకి పల్లెలో పుట్టి పెరిగినా మెదడు చాలా పదునైనది, చురుకైనది.


సమయం 9:47; రోడ్డు మీద

టీ తాగేసి మళ్ళీ రూమ్ వైపు నడక సాగిస్తున్నారు ఇద్దరూ..

"అదేంట్రా రోడ్లన్నీ ఇంత ఖాళీగా ఉన్నాయ్! ఇంకా పది కూడా కాలేదు. సిటీల్లో అర్థరాత్రి 12 అయినా ఎంతో కొంత సందడిగానే ఉంటుంది కదరా" అని అడిగాడు విజయ్ అక్కడి రోడ్లని పరిశీలనగా చూస్తూ.


"ఔను కానీ, ఇక్కడా అలా కాదు! ఈ మధ్య ఇక్కడికి కొత్తగా ఓ గ్యాంగ్ వచ్చిందిరా. వాళ్ళు చేయని క్రైమ్ అంటూ లేదూ. వాళ్ళు వచ్చిన దగ్గర నుండి రాత్రి ఎనిమిది దాటితే జనాలు రోడ్ల మీదకి రావడానికి భయపడుతున్నారు. ఎంతో అత్యవసరం అనుకుంటే తప్ప. ఎవరికీ వారూ సొంతంగా కర్ఫ్యూ విధించుకుని బ్రతుకుతున్నారిక్కడ. ఇందాక చూసావ్ కదా ఆ హోటల్ ని. మనం ఉన్నాం అని ఉంచాడు. ఇది పరిస్థితి!"


ఆ మాటలు విన్న విజయ్ ఆశ్చర్యంగా చూశాడు.


"మరీ...పోలీసులు?!" అని అడిగాడు విజయ్ సందేహంగా.


"వాళ్ళని పట్టుకోవాలని ప్రయత్నించిన ఓ ముగ్గురు పోలీసులు కనిపించకుండా మాయమయ్యారు!" అని బదులిచ్చాడు ప్రకాశ్ సాధారణంగా.


అది విన్న విజయ్ అక్కడున్న పరిస్థితిలో తీవ్రతను అర్థం చేసుకుని ఆశ్చర్యంగా చూశాడు. ఆ సమయంలో నిదానంగా వాతావరణంలో మార్పు వస్తుంటుంది. ఆకాశం మేఘావృతమై, వర్షం పడబోతుందేమో అన్నట్టు ఉంది.


అలా మాట్లాడుకుంటూ ఇంకో రోడ్ లోకి తిరిగారు ఇద్దరూ.

అక్కడ ఉన్న ఒక పాత భవంతిని చూపిస్తూ "రేయ్! ఇది ఫేమస్ రెస్టారెంట్ కమ్ బార్ కదా? ఇలా అయిపోయిందేంటి, ఎవరూ మైంటైన్ చేయట్లేదా" అడిగాడు విజయ్.


"అలా చేయి చూపించకు, అదే వాళ్ళుండే అడ్డా! ఆ రెస్టారెంట్ ఓనర్ నుండి దౌర్జన్యం చేసి లాక్కున్నారు. ఆ తరువాత వాళ్లకి అనుగుణంగా దీన్ని ఇలా మార్చుకున్నారు. ఈ సందులోకి ఎవ్వరూ రావడానికి ధైర్యం చేయరు. కానీ, నువ్వు కాబోయే పోలీస్ కదా! నీకు చూపించినట్టు ఉంటుందని ఇటు తీసుకొచ్చాను", చెప్పాడు ప్రకాశ్.


విజయ్ దాన్ని పరిశీలనగా చూస్తూ ముందుకి నడుస్తున్నాడు. ఇంతలో వర్షపు చినుకులు పడటం మొదలయ్యింది. వాళ్ళ నడకలో కాస్త వేగం పెరిగింది.

"పదా పదా...వర్షం పెద్దది అయ్యేలా ఉంది" అంటూ ప్రకాశ్ వేగంగా ముందుకి కదిలాడు.

అలా వాళ్లిద్దరూ ఆ రోడ్ చివరి దాకా వెళ్లి మలుపు తిరుగుతున్న సమయంలో ఆ భవంతి నుండి ఒక అమ్మాయి అరుపు పెద్దగా వినిపించింది.

ఆ అరుపు విన్న ఆ ఇద్దరూ ఆగారు. విజయ్ వెనక్కి తిరిగి ఆ భవంతి వైపు నడవటం మొదలుపెట్టాడు. ప్రకాశ్ అతన్ని వద్దని వారిస్తున్నాడు.

"అరే! వద్దురా ఎస్.ఐ సెలెక్షన్స్ అయ్యే వరకూ కాస్త ఓపిక పట్టారా...ఇప్పుడు ఏదైనా అయి నువ్వు ఇర్రుకుంటే నీ కల చెదిరిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఓ సాధారణ మనిషివి, లోపలకి వెళ్ళాలి అంటే నీ ఒంటి మీద ఖాకీ ఉండాలి. అది వచ్చే వరకూ కాస్త ఓపిక పట్టు!" అని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ప్రకాశ్.


"ఖాకీ ఉండి కూడా ఏం చేసారు? ముగ్గురు మాయమైపోయారని చెప్పావ్ కదా! అయినా ఓ పక్కన ఓ ఆడపిల్ల ఆ రాక్షసులకు బలైపోతుంటే చూస్తూ వదిలేద్దాం అంటావేంటి?" అని కోపంగా అరుస్తూ ప్రకాశ్ ఎంత చెబుతున్న వినకుండా ఆ భవంతిలోకి ప్రవేశించాడు విజయ్.


చేసేది లేక ప్రకాశ్ కూడా విజయ్ తో పాటుగా భవంతిలోకి వెళ్తాడు.

గ్రౌండ్ ఫ్లోర్ లో చుస్తే ఎవరూ ఉండరు. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లడం కోసం మెట్లు ఎటు వైపు ఉన్నాయని విజయ్ చూస్తున్నాడు.


ఇంతలో..."అరై విజయ్! నేను చెప్పేది వినరా....లోపల వాళ్ళ కనీసం పదిమంది దాకా ఉండచ్చు, వాళ్ళ చేతుల్లో ఆయుధాలుంటాయి, మనమేమో ఇద్దరమే ఉన్నాం, పైగా ఒట్టి చేతులతో వచ్చాము. నువ్వేం సినిమాలో హీరో కాదు ఒక్కడివే వెళ్లి అందరినీ ఇరగ్గొట్టడానికి, చంపేస్తారు!" అని వారిస్తుంటాడు ప్రకాశ్.


"నేను హీరోనే, కాబోయే పోలీస్ ని, రిస్క్ ఉంటుందని తెలిసే సెలెక్షన్స్ కి వచ్చా, నేనే కాదు పోలీస్ అవుదాం అనే ప్రతీ ఒక్కరు రిస్క్ అని తెలిసినా తెగించి ముందడుగు వేస్తారు. ఇప్పుడు నేను చేసేది అదే. ఇక్కడే తేలిపోతుంది వెథర్ ఐ ఆమ్ ఫిట్ ఆర్ అన్ ఫిట్!" అంటూ పక్కన ఉన్న ఒక టేబుల్ పైన ఓ రెంచ్ ఉంటే, దాన్ని ఒక్కసారిగా తీసుకుని ప్రకాశ్ వెనుకున్న గోడ వెనుక రెడీ గా గన్ పట్టుకుని ఎయిమ్ చేసి ట్రిగ్గర్ నొక్కబోయిన ఓ గూండా తలా మీదకి విసిరాడు.


అది తగిలిన ఆ గూండా కింద పడిపోయాడు. విజయ్ చర్య చూసి ప్రకాశ్ ఆశ్చర్యపోయాడు.


విజయ్ ఆ గూండా చేతిలో గన్ తీసుకుని, “సైలెన్సర్ వాడుతున్నారు.. పర్లేదు అప్డేటెడ్ గానే ఉన్నారు!” అంటూ పైకి వెళ్తూ.. సరిగ్గా స్టెప్స్ మొదటి అంతస్థు ని చేరుకునే దగ్గర వంపు తిరిగిన చోట నుండి ఒకడు గన్ తో కాల్చబోతుంటే విజయ్ వాడిని సరిగ్గా నడుము మీద కాల్చడంతో వాడు కిందకి తూలిపడ్డాడు.


విజయ్ చర్యకు ఆశ్చర్యంగా చూస్తున్న ప్రకాశ్ ని చూసి, “ఏంటి అలా చూస్తున్నావ్? ట్రైనింగ్ వరకూ ఆగలేక షూటింగ్ నేర్చుకున్నాలే.. పద!” అంటూ ఆ కిందపడిన వాడిని దాటుకుంటూ పైకి వెళ్లాడు.


వెళ్ళగానే నేల మీద రక్తపు మడుగులో వెల్లకిలా ఓ అమ్మాయి పడి ఉండటం గమనించారు ఇద్దరు. అంత చీకటిలో ముఖం సరిగ్గా కనపడటం లేదు. పైగా ముఖమంతా రక్తం అంటుకుని ఉంది. శరీరంలో ఎక్కడా చలనం లేకపోవడంతో ఆ అమ్మాయి చనిపోయిందని అనుకున్నారు.


“రేయ్! ఆ అమ్మాయి ప్రాణాలతో లేదు.. ఇక పోరాడటం అనవసరం. మిగతా వాళ్ళు ఇక్కడే ఎక్కడో మనల్ని చూస్తూ ఉండి ఉంటారు! వాళ్ళు కూడా మనల్ని ఎటాక్ చేసే ముందే ఇక్కడి నుండి వెళ్లిపోదాం రా..” అన్నాడు ప్రకాశ్.


“ప్రాణం ఉన్నంతవరకేనా మనిషికి విలువ? తనకి న్యాయం జరగాల్సిందే! దాక్కున్న మృగాలు వచ్చేవరకూ ఇక్కడే ఉంటా!” అని విజయ్ మొండిగా అక్కడే చూస్తూ నిలబడ్డాడు.


అప్పుడు కొంతమంది ముఖానికి మూసుగులు వేసుకుని ఎదురుగా వచ్చి నిలబడ్డారు.


వాళ్ళని చూసిన విజయ్, “మృగాలు మూసుగులేసుకున్నాయేంట్రా? డేంజరస్ అంటే గుంపుగా వచ్చి భయపెట్టడం కాదురా.. సింగల్ గా ఉన్నా భయపడకపోవడం!” అని రెచ్చగొట్టే విధంగా వెటకారంగా అన్నాడు.


అప్పుడు ఒకడు కొట్టడానికి మీదకి వచ్చాడు. దాంతో వారి మధ్య ఫైట్ మొదలయ్యింది. అలా ఫైట్ చేస్తూ ఆ బిల్డింగ్ బయటకు వచ్చారు. బిల్డింగ్ వెనుక సందులో, బోరున కురుస్తున్న వర్షంలో ఫైట్ చేసుకుంటున్నారు ఇరువురు. అందరినీ విజయ్ చితక్కొడతాడు గాని, ఒక్కడు మాత్రం తప్పించుకుని పారిపోయాడు.


అప్పడు ప్రకాశ్, “అదేంటి, వాడిని మాత్రం ఎందుకు వదిలేశావ్?”


“మెయిన్ తలకాయ ఇక్కడ లేదు.. అది ఇంకెక్కడో దాక్కుంది. వాడికి వీడు ఇప్పుడెళ్లి చెబుతాడు ‘మనం కాదన్న డేంజరస్.. ఇంకోకడున్నాడన్నా’ అని. సొ, వాడు నాకోసం ప్రిపేర్ అవుతాడు, బయటకి వస్తాడు, వచ్చాడంటే నా కంట పడకుండా ఉండడు.. వాడిని నేను కచ్చితంగా లోపలేస్తా!” అని విశ్వాసంగా చెప్పాడు విజయ్.

విజయ్ మాటలు విన్న ప్రకాశ్, “ఫుల్ ప్రిపేర్ అయి వచ్చావ్ కదా!” అన్నాడు నవ్వుతూ.


“సరే పద! పాపం ఆ అమ్మాయి ఎవరో, ఎవరి తాలుకో కనుక్కుని వాళ్ళకి అప్పగించాలి” అని మళ్ళీ బిల్డింగ్ లోపలకి వెళ్లాడు విజయ.


విజయ్ వెనుక ప్రకాశ్ కూడా లోపలకి వచ్చాడు. ఆ అమ్మాయి పడి ఉన్న చోటుకి వెళ్ళి, అక్కడ బాడి కనిపించకపోయేసరికి ఇద్దరూ ఆశ్చర్యపోయారు.


వెంటనే ప్రకాశ్ సెల్ టార్చ్ ఆన్ చేశాడు. అటు ఇటు చూసి, టార్చ్ గోడ మీదికి తిప్పగా..

“నన్ను చంపిన వాళ్ళని చంపేంత వరకూ నా ఆత్మ శాంతించదు – వైష్ణవి!” అని రక్తంతో రాసి ఉంది.

ఆ రాతలను చూసి ఇద్దరూ మరింత ఆశ్చర్యానికి గురయ్యారు. విజయ్ కాస్త ఆశ్చర్యం నుండి తేరుకుని మిగతా గదులు, గ్రౌండ్ ఫ్లోర్, బిల్డింగ్ బయట రోడ్లు చూశాడు..

ఎవరూ కనిపించకపోవడంతో ఏమి చేయాలో తెలియని అయోమయంలో పడ్డాడు!


--- ఇంకా ఉంది!41 views2 comments

Recent Posts

See All

2 Comments


Radha Manikala
Radha Manikala
Apr 13, 2021

Waiting for next...

Like
Hemanth Karicharla
Hemanth Karicharla
Apr 13, 2021
Replying to

Yeah! Thank you!🙂

Like
bottom of page