top of page

ఆపరేషన్ Vi - E2

Updated: Apr 26, 2021

ఎపిసోడ్ 2


అలా ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో విజయ్ మళ్ళీ ఆ గోడ దగ్గరకు వెళ్లి, అక్కడ దొరికిన ఒక కంకర రాయితో "ఆమెను ఇక్కడ నుండి తీసుకెళ్లిన వాళ్ళని నేనూ వదలను! - విజయ్" అని రాసాడు.

***


విజయ్, ప్రకాష్ రూమ్ కి చేరుకున్నారు...

విజయ్ తీక్షణంగా ఆలోచిస్తూ, "పాపం ఆ అమ్మాయిని ఏం చేసుంటారో?" అని అన్నాడు.


"నువ్వు ఆ అమ్మాయిని ఏం చేసుంటారని ఆలోచిస్తున్నావు.. నేను వాళ్ళు మనల్ని ఏం చేస్తారో అని భయపడుతున్నా" అన్నాడు ప్రకాష్ భయంగా.


"భయపడకు... నేను రేపే వేరే రూమ్ చూసుకుంటా. నేను నీతో ఉంటేనే నీకు ప్రాబ్లెమ్"


"ఛ.. ఛ..! విడిగా ఉండటమేంట్రా నేనుండగా. నేను నీ కెరీర్ గురించి ఆలోచించి ఇందాక నిన్ను ఆపాను గాని, నువ్వు నాతో ఉంటే నాకు ప్రాబ్లెమ్ అని కాదు! ఏమొచ్చిన ఇద్దరం కలిసే ఫేస్ చేద్దాం!" అని ప్రకాష్ అనగానే తలుపు చప్పుడు అవుతుంది.


దాంతో వాళ్ళు మాటలాపి తలుపు వైపు చూసారు. మళ్ళీ తలుపు ఎవరో 'టక్ టక్ టక్..' మంటూ బలంగా కొట్టారు. అప్పుడు ఎవరా, ఏంటా అన్నట్టుగా ఇద్దరూ కాస్త కంగారుగా చూస్తున్నారు. ఇంతలో విజయ్ కి వెనుక వైపున మరో తలుపు కనిపించింది. దాంతో ఇద్దరూ ఆ తలుపు నుండి ఇంటి బయటకి వచ్చి, నిదానంగా ఇంటి ముందుకి అంటే ముఖద్వారం వైపు నడవగా దూరం లో ఓ ఇద్దరు ముసుగు మనుషులు ఇంటి ముందు నిల్చొని ఉండటం గమనించారు.


"నువ్విక్కడే ఉండు..." అంటూ విజయ్ వేగంగా వాళ్ళ దగ్గరికి వెళుతూ, "ఆ అమ్మాయిని ఏం చేసార్రా?" అంటూ వాళ్లకి ఎదురుపడి, మీదకి కొట్టడానికి వచ్చిన వాడిని పిడికిలితో బలంగా పొట్టలో గుద్దితే, వాడు కింద పడ్డాడు.


అప్పుడు ఇరువైపుల నుండి మరో నలుగురు ముసుగు వేసుకుని వచ్చారు. మళ్ళీ వాళ్ళ మధ్య కొట్లాట మొదలయ్యింది. అయితే, ఎంతమందిని కొడుతున్నా కొత్తగా వస్తూనే ఉన్నారు. విజయ్ కి కూడా ఉన్న ఓపికంతా అయిపోతుంది. అలా ఆ కొట్లాటలో విజయ్ ఒకడిని తరుముతూ ఉండగా ఎదురుగా కొంత దూరం నుండి ఓ పోలీస్ జీప్ రావడాన్ని చూసి మిగతా గూండాలు అక్కడి నుండి పరారవుతారు. నైట్ టైం పెట్రోలింగ్ లో భాగం గా అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ రాకేష్ కుమార్ దెబ్బలతో ఎదురుపడ్డ విజయ్ ని చూసి జీప్ ఆపాడు.


విషయం తెలుసుకుని, ఇద్దరినీ జీప్ ఎక్కించుకుని అక్కడి నుండి బయలుదేరాడు రాకేష్ కుమార్.

***


దారిలో కూడా ఉన్న హెడ్ కానిస్టేబుల్ ని తన ఇంటి దగ్గర దించేసి, రాకేష్ కుమార్ ఇంటికి చేరుకున్నారు ముగ్గురు...

"నీ ధైర్యం, తెగింపు నాకు నచ్చాయి విజయ్, వెల్కమ్ టు ఫ్యామిలీ!" అన్నాడు రాకేష్ విజయ్ దెబ్బలకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ.


"థ్యాంక్ యూ సర్!" అని బదులిచ్చాడు విజయ్ నవ్వుతూ.


"చూడండి, చెప్పడానికి సిగ్గుగా ఉన్నా... మేము ఆ బంగ్లా లోకి, వాళ్ళు మేముండే కాలనీల వైపుకి రాకూడదని ఒప్పందం. కాబట్టి ఇక్కడికి ఎవరూ రారు. మీరు నిశ్చింతగా ఉండచ్చు!" చెప్పాడు రాకేష్.


"అదేంటి సర్.. గుండాలతో పోలీసులకి ఒప్పందమా?" ప్రశ్నించాడు విజయ్ ఆశ్చర్యంగా.


"ఏం చేస్తాం విజయ్... శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ఈ దిక్కుమాలిన ఒప్పందానికి అంగీకరించాల్సి వచ్చింది. చూసావుగా, రాజభటుల్లా ఆ వెధవలు ఎంతమంది సైన్యమై ఉన్నారో. ఎంతమంది నేలకూలితే, అంతమంది నీ మీదకి దూసుకువచ్చారు. వాళ్ళనాపాలి అంటే పెద్ద యుద్ధమే చేయాలి. కానీ, ఆ యుద్ధంలో చాలా మంది అమాయకమైన ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతారు. అందుకే, ఏమీ చేయలేక ఇలా నీచమైన బతుకు బతుకుతున్నాం!"


"హ్మ్... సర్ ఎంత పెద్ద సైన్యమైన దానికో లెక్కుంటుంది. అలాగే ప్రతీ సైన్యాన్ని వెనుక ఉంటూ ముందుకు నడిపించే ఓ సైన్యాధ్యక్షుడు ఉంటాడు. వాడిని వేసేస్తే వీళ్ళని అదుపు చేయడం పెద్ద విషయమేమి కాదు. కాబట్టి, మనం గురిపెట్టాల్సింది ముందొచ్చే భటులమీద కాదు, వాళ్ళ వెనకున్న నాయకుడి మీద. మనం కొట్టే దెబ్బ ఎలా ఉండాలి అంటే, ఆ దొంగ నా రాజు రాజ్యాన్ని మనకి అప్పగించి, సరెండర్ అయిపోవాలి!"


"దిమాఖ్ గట్టిగానే ఉంది.. కానీ ఇదంతా ఎలా?"


"కొంచెం టైం ఇవ్వండి గురు గారు. ఎంతసేపు ప్రశ్నలు, సమాధానాలేనా.. విశ్రాంతి ఉండదా!"


"ఏదో ఆరాటం కొద్దీ అడిగాను. నిజమే రేపటి నుండి ఎలాగో పోరాటం కొనసాగుద్ది... విశ్రాంతి చాలా అవసరం. గుడ్ నైట్!" అని రాకేష్ నవ్వుతూ వాళ్ళ గది నుండి బయటకు వచ్చాడు.


***


మరుసటి రోజు ఉదయం;

విజయ్ నిద్రలేచి అద్దంలో ముఖం చూసుకుంటూ, "అబ్బో ఇంత గెడ్డంతో మరీ పిచ్చోడిలా ఉన్నాను. షేవ్ చేద్దాం" అని తనలో తాను అనుకుని ఫ్రెష్ అవడానికి బాత్రూం లోకి వెళ్ళాడు.


కాసేపటికి, చక్కగా తయారయ్యి ప్రకాష్ ని లేపాడు. క్లాన్ షేవ్ తో ఉన్న విజయ్ ని చూసి ప్రకాష్, "రేయ్! ఏంట్రా ఈ చేంజ్ ఓవర్... శివపుతృడులా ఉండేవాడివి రెమెలా మారిపోయావు!" అన్నాడు ఆశ్చర్యంగా.


"ఏం లేదురా... ఓ ముఖ్యమైన పనిమీద బయటకెళ్తున్న. మళ్ళీ వాళ్ళు చూస్తే డిస్టర్బ్ చేస్తారు. ఈ లుక్ కంప్లీట్ గా కాకపోయినా కొంతవరకైనా సేవ్ చేస్తుంది కదా అని మార్చాను." అని చెప్పాడు విజయ్ నవ్వుతూ.


"ఏది ఏమైనా... అదిరిపోయింది పో!" అన్నాడు ప్రకాష్.


"సర్లే బై... జాగ్రత్తగా ఉండు!" అంటూ రాకేష్ దగ్గరకి వెళ్లి, "సర్, మీ బైక్ నేను తీసుకెళ్లొచ్చా?" అని అడిగాడు.


ఒక్కసారిగా విజయ్ ని అలా చూసిన రాకేష్ కూడా ఆశ్చర్యపోతూ... "న్యూ లుక్ అదిరింది విజయ్. అండ్ యా హ్యాపీ గా తీసుకెళ్ళచ్చు" అని కీస్ ఇచ్చాడు.

అప్పుడు విజయ్ "థ్యాంక్ యు సర్!" అంటూ కీస్ తీసుకుని బయలుదేరాడు.


***


సిటీ సెంటర్ లో బండి ఆపి, జేబులో నుండి పర్సు తీసాడు విజయ్. ఆ పర్సులో ఓ అమ్మాయి ఫోటో ఉంది. ఎదురొచ్చే ప్రతి ఒక్కరికీ చూపిస్తూ, "ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా?" అని అడుగుతూ ఉన్నాడు. ఎవరూ చూడలేదు అని చెప్పి వెళ్లిపోతున్నారు.


ఆ క్రమంలో ఒక అమ్మాయిని ఆపి అడిగితె... ఆమె ఆ ఫోటో చూసి, ఆ తరువాత విజయ్ ని తీక్షణంగా చూస్తూ, ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టు, "మీరూ... విజయ్ కదా?" అని అడిగింది సందేహంగా.


"ఔను... మీకెలా తెలుసు!?" అని అడిగాడు విజయ్ ఆశ్చర్యంగా.


సరిగ్గా అప్పుడు ఒకడు డాష్ ఇచ్చి వెళ్లిపోతుంటాడు చాలా నిర్లక్ష్యంగా సారీ చెబుతూ. దాంతో, చేతిలో ఉన్న పర్సు కిందపడిపోయింది. కింద పడిన పర్సుని తీసి దుమ్ము దులుపుతూ గుద్దిన వాడి వైపు చూసాడు విజయ్. వాడు విజయ్ వెనక్కి విజయ్ వైపే అదోరకంగా చూస్తూ ముందుకి వెళుతున్నాడు. వాడి ప్రవర్తన విజయ్ కి అనుమానం తెప్పించింది.


ఇటేమో తనని గుర్తుపట్టిన అపరిచితురాలు, ఇంకోవైపు తనని గుర్తుగా చూసున్న వాడు... విజయ్ కి ఏం చేయాలో అర్థం కాలేదు.


మళ్ళీ ఇంతలో, "వైషూ మీ గురించి చెప్పింది... తనని వెతుకుతున్నారంటే, కచ్చితంగా మీరే విజయ్ అయ్యుంటారని అలా అడిగా!" అని చెప్పింది ఆ అమ్మాయి.


అది విని విజయ్, "వైషూ ఎవరు?" అని ప్రశ్నించాడు.


"అదేంటి ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి, మీరు కొద్దిరోజుల ముందు కొంతమంది రౌడీలా నుండి సేవ్ చేసిన అమ్మాయి, వైషూ... అదే వైష్ణవి!" అని సమాధానమిచ్చింది తను.


'వైష్ణవి' పేరు వినగానే, విజయ్ కి ఒక్కసారిగా ఆ బిల్డింగ్ లో జరిగిన సంఘటన గుర్తొచ్చింది.

ఇంతలో, "హలొ మిమ్మల్నే... మీరు విజయ్యే కదా?" అని మళ్ళీ అడిగింది.


"నేను విజయనే కానీ, ఈ అమ్మాయి పేరు గౌరీ కదా..."


"గౌరీ ఏంటీ, తను వైష్ణవి, నా క్లోజ్ ఫ్రెండ్ నా చిన్నప్పటి నుండి. మీరే పేరు కన్ఫ్యూజ్ అవుతున్నారు!" అని అంది.


"నిజమే... ఇప్పుడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది!" అని అన్నాడు కాస్త పైకి వినిపించేలా.


--- ఇంకా ఉంది!


ఎపిసోడ్ 1 కొరకు - క్లిక్ చేయండి


మరెన్ని ఆసక్తికర కథలు, కవితలు, వ్యాసాల కోసం 'హేమంత్ స్టోరీస్' ని Subscribe చేసుకోండి!

31 views1 comment

Recent Posts

See All

1 comentario


Radha Manikala
Radha Manikala
21 abr 2021

Maku kuda confusion start aindhi.. update super andi..

Me gusta
bottom of page